అక్కడ చూడదగిన ప్రదేశాలెన్నో

ప్రసిద్ధిగాంచిన చదువుల తల్లి సరస్వతీ క్షేత్రం ముథోల్‌ మండలం బాసరలో నెలవైంది. ఈ ఆలయానికి దేశవ్యాప్తంగా ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. చిన్నారులకు అమ్మవారి చెంత అక్షర శ్రీకారపూజలు జరిపించాకే బడుల్లోకి పంపుతారు. పర్వదినాల్లో ఇక్కడ భక్తులు లక్షల్లో తరలివస్తారు. గోదావరి నది ఒడ్డున సూర్యేశ్వరస్వామి ఆలయం ఉంది. సరస్వతీ అమ్మవారి ఆలయం పక్కనే కాళికమాత, దత్తాత్రేయ, వ్యాసమహర్షి ఆలయాలు  నెలకొన్నాయి. బాసర పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. ఇక్కడికి వచ్చే వారు చుట్టుప్రక్కల ఆలయాలను దర్శించుకోవచ్చు. బాసరకు చేరుకునేందుకు రైలు మార్గం కూడా ఉంది. బాసర స్టేషన్‌దాటితే మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ స్టేషన్‌ వస్తుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, భద్రాచలం, సికింద్రాబాద్, హైదరాబాద్‌ డిపోల నుంచి బాసరకు బస్సులు వస్తుంటాయి.