న్యూఢిల్లీ: అనంతపురం-అమరావతి యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం ఖరారు చేసినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. 384 కిలోమీటర్ల పొడవు అలైన్‌మెంట్‌తో ఈ రహదారి నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి రాజ్యసభలో సోమవారం అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా గ్రాండ్ చాలెంజ్ కింద కొత్తగా రహదారి ప్రాజెక్ట్‌లు చేపట్టవలసిందిగా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరవచ్చునని ఆయన తెలిపారు. అయితే అలాంటి ప్రాజెక్ట్‌ల్లో భూసేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించడానికి ఆయా రాష్ట్రాలు ముందుకు వస్తే మిగిలిన వ్యయంతోపాటు ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని కూడా కేంద్రమే భరిస్తుందని చెప్పారు. అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే అనేక మార్లు రవాణా శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో సమావేశాలు నిర్వహించారని తెలిపారు.
అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేకు గ్రీన్ సిగ్నల్